11, మార్చి 2012, ఆదివారం

                                                సమరంలో సరదా...!!


రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మొత్తం ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. వాడి వేడి విమర్శలు జనానికి కావలసినంత వినోదాన్ని పంచుతున్నాయి. నిజానిజాలు ప్రజలకు తెలుసు. ప్రజలు విచక్షణ .. వివేచనతో సమయోచిత..సందర్భోచిత నిర్ణయాలు తీసుకుంటారని నాయకులకే తెలియడంలేదు. నిన్న గాక మొన్న ఉత్తరాదిన ఎన్నికలు జరిగితే... ప్రజా తీర్పు ఎంత నిజాయితీగా ఉంటుందో వెల్లడైంది. తమ ఆశలకు... ఆకాంక్షలకు అనుగుణoగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలిసొచ్చింది. అయినా ప్రజల్ని బురిడీ కొట్టించాలనే మన నేతల దింపుడు కళ్ళం ఆశలు నేరవేరతయా..? ప్రజా చైతన్యం ప్రపంచ వ్యాప్తంగా కనబడుతోంది. ప్రజలు  నాయకుల విశ్వసనీయతను కొలబద్దగా పరిగణిస్తున్నారు. నిజాయితీకి ఓటేస్తున్నారు. నిఖార్సైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఉప ఎన్నికలు తెలంగాణలో అయినా... సీమాంధ్రలో  అయినా  ఇది కచ్చితంగా కీలక సమయం. ఈనాటి ప్రజాతీర్పు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందనడంలో సందేహంలేదు. స్వాతంత్రానంతర కాలంలో ఇప్పటి వరకు రెండు తరాలు గడచిపోయాయి. మూడో తరం ముందుకు వచ్చింది. వృద్ధ జంబూకాలకు యువతరం వీడ్కోలు చెబుతోంది. అఖిలేష్ యాదవ్ లాంటి భావితరాన్ని స్వగాతిస్తోoది. ఇదే దేశవ్యాప్తంగా కనిపిస్తోన్న మార్పు. యువతలోనూ జన హృదయాలను దోచుకున్నవారే నాయకుడిగా నిలబడగలుగుతున్నారు. రాహుల్ ను తిరస్కరించిన ప్రజలు అఖిలేష్ ను అక్కున చేర్చుకున్నారు. ఇద్దరిలో ఏ వైవిధ్యాన్ని జనం కనుగొన్నారో ఇప్పటికిప్పుడు తెలుసుకోవడం కష్టమే..! అయినా..  పాతతరం నేతలు నిశితంగా పరిశీలించక తప్పదు. కొందరైనా గౌరవంగా రాజకీయాలనుంచి తప్పుకుంటే తిరస్కరణలు.., చీత్కారాలు లేకుండా బయటపడొచ్చు. ఒకటి రెండుసార్లు మంత్రులు .., ముఖ్యమంత్రులుగా చేసిన వారికి ఇంకా ఎందుకింత రాజకీయ వ్యామోహమో అర్థం కాదు. అరవై ఏళ్ళు రాకముందే ఉద్యోగాలనుంచి పంపిస్తున్న నేతలు.. డెభ్భై దాటుతున్నా చూరుపట్టుకు వేలాడడం ఏ రకం నీతో తెలీదు. నాయకత్వ లక్షణాలు పుట్టుకతో రావు. సామాజిక నేపధ్యాన్ని పరిశీలించి.. ప్రజా సంక్షేమాన్ని కాoక్షిస్తే వస్తాయి. ఇప్పటికే మన రాష్ట్రంలోని కొందరు నాయకులు తమ వారసులను రంగంలోకి దించుతున్నారు. మరికొందరు పరిస్తితుల ప్రభావంవల్ల నేతలుగా మారుతున్నారు. ఏ  కోవకు చెందినా యువ నాయకుడే జగన్. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి, అధికార పక్షానికి ఏకైక.. ఉమ్మడి శత్రువు ఒక్క జగన్ మాత్రమే. జగన్ చాల తెలివిగా తెలంగాణా బరినుంచి తప్పుకున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టడంలో ఆయన నేర్పరిలా కనబడుతున్నారు. ఒకటి తెలంగాణా ప్రజల మనసుల్ని దోచుకోవడం. రెండు.. వృధా ప్రయాసను తప్పించుకోవడం. అలసట లేకుండా కోవూరులో ప్రచారం చేసుకోవచ్చు. తెలంగాణా ప్రజలు 2014 లో ఎలాగు తీర్పు చెప్పాలి. అప్పటిలోగా తన పునాదులు పటిష్టం చేసుకోవడం జగన్ వ్యూహంలో భాగమని భావించాలి.  ఇప్పటికి రెండుసార్లు టిడిపి ని ప్రజలు తిరస్కరించారు. రాజశేఖరరెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా హనుమన్నలాంటి వాళ్ళు మాత్రం సోనియమ్మ బొమ్మ చూసి.., రాహుల్ రంగు చూసి ముచ్చటపడి వోట్లేశారని వకాల్తా పుచ్చుకుంటారు. ఎవరి అజ్ఞానం..అతి విశ్వాసం వారివి. ఇప్పుడు తెలిసిపోతుందిగా.. ఎవరి సత్తా ఏమిటో...! కనీసం ఉప ఎన్నికల్లో ఒకరిద్దరు అభ్యర్దులనైనా గెలిపించుకోలేనివారు.. రెండేళ్ళ తర్వాత ఎవరి నెత్తిన చెయ్యి పెట్టగాలుగుతారు. బంగారానికైనా కొంతకాలం తర్వాత వన్నె తగ్గుతుంది. అలాగే టియారెస్ ఉనికి మసకబారుతున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు ఆపార్టీ కి కూడా జీవన్మరణ సమస్యే. పోలింగ్ తేది దగ్గరపడుతుండడంతో విమర్శనాస్త్రాలు సంధించడం ఎక్కువైంది. ఫలితంగా జనం చెవుల తుప్పు వదిలి పోతోంది. తీర్పు వెలువడే వరకూ మనకీ బాధ తప్పదు.. భరిద్దాం..!!
                                                                                                                                       -శివరాం

6, మార్చి 2012, మంగళవారం

జగన్ వైపు... జనం చూపు..!
 ప్పటికైనా కాంగ్రెస్ కళ్ళు తెరవాలి.నూటపాతికేళ్ళ చరిత్ర గల పార్టీకి దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పుట్టగతుల్లెకుండా పోవడమేంటి..? రాహుల్ తప్ప దిక్కులేదని కాంగ్రెస్ వృద్ధ జంబూకాలు కూడా నొక్కి వాక్కాణిస్తున్న తరుణంలో ఆ యువ నాయకుడి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. యూపిలో రెండోసారి ఆయనకు శృంగభంగం తప్పలేదు. నెహ్రు నాటి నాయకత్వ లక్షణాలు ఇప్పుడు ఎవరిలోనూ మచ్చుకైనా కనిపించడం లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధిలో నాయకత్వ పటిమ లేదని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. అయినా ఆయన తప్ప ఆ పార్టీకు దిక్కులేని దయనీయ స్థితి..! వంద కోట్ల భారతీయులను ఒక్కతాటిపై నడపడం ఆనుకున్నoత ఆషామాషీ వ్యవహారం కాదు. దివంగత ఇందిరకున్న నాయకత్వ లక్షణాలు సోనియాలో ఒక్కటి కూడా కనిపించవు. నెహ్రు నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఇందిరకు.. ఇటలీ నుంచి కోడలిగా వచ్చిన సోనియాకు నక్కకు... నాగలోకానికీ ఉన్నంత తేడావుంది. ఇక.. నిన్న మొన్నటి వరకూ తల్లిచాటు బిడ్డగా పెరిగిన రాహుల్ ఒక్కసారిగా కాంగ్రెస్ వంటి మహావృక్షాన్ని చక్క దిద్దగలడనుకోవడం అత్యాసే..! ఆమాటకొస్తే రాష్ట్రంలో జగన్ కూడా అంతేకదా అనొచ్చు. జగన్ ఒక దశాబ్ద కాలంగా వ్యపార రంగంలో ఉన్నారు. తండ్రి అగస్మాత్ మరణంతో రాజకీయ వారసత్వాన్ని నేత్తికేత్తుకోక తప్పలేదు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన రాజశేఖర రెడ్డి మరణంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడానికి జగన్ కొత్త బాధ్యతలు చేపట్టారు. ఆయనలో పదవీకాంక్షకు బీజం వేసింది కాంగ్రెస్ నాయకులే. అది మొక్కై.. మానై.. బలమైన ఆశయంగా మారడానికి కారకులు కూడా వారే. జగన్ ఇప్పుడు రాజకీయ వట వృక్షంగా మారడంతో ఇటు కాంగ్రెస్ కు..., అటు టిడిపి కి దిక్కుతోచడం లేదనడంలో సందేహంలేదు. కాంగ్రెస్ రాజకీయాలతో విసిగెత్తిన జనం కొత్త తరంవైపు ఆశగా చూస్తున్నారని యుపి ఎన్నికల ఫలితాలను చూస్తే.. అర్థం అవుతుంది. అలాగని సోనియా వారసత్వాన్ని నేత్తినేక్కిoచుకోవడానికి  ప్రజలు సిద్ధంగా లేరు. యూపిలో అఖిలేష్ యాదవ్ ఆశాదీపంగా కనిపించారు. అంతేకాదు...రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయమన్న మాయావతి డిమాండ్ ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యుపి ని ముక్కలు చేస్తే భరించలేమని జనం  ముక్తకంఠంతో  తీర్పు చెప్పారు. కాంగ్రెస్ మార్కు రాజకీయాలను ప్రజలు  ఏవగించుకుంటున్నారనడానికి యుపి ఫలితాలే నిదర్శనం. ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఎప్పుడైనా ఇలాంటి ఫలితాలే ఇస్తాయనడంలో సందేహంలేదు. జనాన్ని నడిపించడమేకాదు... జనాభిప్రాయాన్ని అర్థం చేసుకుని వారివెంట నడవడం కూడా నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఆపనే ఇప్పుడు జగన్ చేస్తున్నారు. జనాభిప్రాయం మేరకు నడవలేకపోయినా చంద్రబాబు కు రెండుసార్లు తిరస్కారం తప్పలేదు. ఇప్పటికీ ఆయన తీరు మారినట్లు కనిపించడంలేదు. ఒకపక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన స్థితిలో... సమర్థ ప్రతిపక్షం కూడా లేకపోవడంతో జనం జగన్ వైపు చూస్తున్నారు. యుపి ఎన్నికల ఫలితాలు మన రాష్ట్ర నేతలకు చెంపపెట్టు. ఇదేతీరు కొనసాగితే... యూపిలో అఖిలేష్ ను ఆదరించినట్టే ఏపిలోనూ జగన్ కు పట్టం కట్టడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. 2012 లో ఏం జరుగుతుందో చూద్దాం!
                                                                                             -శివరాం

5, మార్చి 2012, సోమవారం

  కట్టుకథలు..పిట్టకథలెందుకు..బాబూ..!!

చoద్రబాబు పిట్టకథలు చెప్పడంలో దిట్ట. తోటకూర కథనైతే మరింత ఆసక్తిగా చెబుతారు. కోవూరులో ఆయన ఈ కథనే నమ్ముకున్నారు. దివంగత రాజశేఖరరెడ్డి పైనా., ఆయన కొడుకు జగన్ పైనా.. శాశ్వత శత్రుత్వాన్ని పెంచుకున్నారని చద్రబాబు మాటల్లో తెలుస్తూనే ఉంది. అయితే జనం ఆయన అనుకున్నంత వెర్రివాళ్ళు కాదనే విషయాన్ని టిడిపి ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. తనదాకా వస్తే.. కోర్టు కేసుల్ని తప్పించుకోవడానికి నానా తంటాలు పడే పెద్దమనిషి జగన్ విషయంలో మాత్రం పిట్ట కథలు చెప్పి జనాన్ని నమ్మించాలని చూస్తాడు. వినేవారుంటే కథలు  చెప్పడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఎక్కడిదాకో ఎందుకు.. చంద్రబాబు బహిరంగ సభలకు తోలుకొచ్చిన జనంలో ప్రతి ఒక్కరూ ఎడతెరిప లేకుండా కథలు చెప్పగలరు. ఇంతకీ చంద్రబాబుకు వేరే అంశాలేవీ గుర్తుకు రావా..? వచ్చినా వాటిని వదిలేసి.. తోటకూర కథనే వల్లెవేస్తారా..? రాష్ట్రంలో సవాలక్ష సమస్యలున్నాయి. మూడు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.వాటన్నింటినీ పట్టించుకోని చంద్రబాబు దివంగత రాజశేఖరరెడ్డి పైనా ఆయన కొడుకు జగన్ పైనా మాత్రమె కథలు ఎక్కుపెడుతున్నరంటేనే ఆయన అక్కసు అర్థమవుతోంది. జగన్ ఎక్కడికీ పారిపోలేదు. అనునిత్యం జనంలో ఉంటున్నాడు. చంద్రబాబుతో పాటు కోవూరులో ప్రచారం చేస్తున్నాడు. జగన్ ఇంతవరకూ రాష్ట్రానికి చెందిన ఏ ఉన్నత పదవిలోనూ లేడు. ఆయనపై అవినీతి మరకలు చిలకరించింది ఇటు  చంద్రబాబు, అటు కాంగ్రెస్ లోని కొందరు పదవుల్లేని పాతకాపులే. వీళ్ళను గురించి ప్రజలకు తెలీదా..? తెలియదని వీళ్ళు భ్రమిస్తున్నారా..? తెహల్కా చంద్రబాబును తెగనాడినపుడు టిడిపి నోరేత్తలేకపోయిందే౦..? ఆయన అవినీతిని ఆధారాలతో సహా వెల్లడించినపుడు మౌనం వహించడం వెనక అర్థం ఏమనుకోవాలి. ఏలేరు కుంభకోణంలో బాబుగారి నిజాయితీ బయటపడినా.. జనం చెవిలో పూలు పెట్టే రాజనీతిని  టిడిపి చక్కగా ఆచరిస్తోంది. ఈ కథలన్నింటినీ జగన్, ఆయన పార్టీ వర్గాలు వల్లెవేయవచ్చు. జనం ముందు కుప్పిగంతులు తగవనే తగ్గివుంటున్నట్టు.. కనబడుతోంది. జగన్ నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కుర్రాడు. చంద్రబాబుకున్న అనుభవం ముందు జగన్ ఎందుకూ పనికిరాడు. అంత అనుభవం ఉన్న.. పరిణితి చెందిన రాజకీయనేత... చనిపోయిన వ్యక్తిపై అవాకులూ చవాకులూ పేలుతూ.. పిట్టకతలతో పోద్దుపుచ్చుతారా ..? జాతీయ రాజకీయాలను ఒంటి చేత్తో చక్రం తిప్పి నడిపించిన చంద్రబాబు... కేవలం రెండు మూడేళ్ళ రాజకీయానుభవం ఉన్న జగన్ పై ఒంటికాలిపై లేస్తూ నోటికొచ్చినట్లు పెలదాన్ని ఆయన విజ్ఞతకే వదిలేయాలి. భావి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలవాల్సిన చంద్రబాబు ఇప్పటికైనా హుందాగా మాట్లాడతారని.. ఆశిద్దాం!!
                                                                                                                   -శివరాం

2, మార్చి 2012, శుక్రవారం

 జగన్ వెంట జనంలోకి....
 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డు కాలం వచ్చి పడింది. కేంద్రం ఒత్తిడి మేరకు 17 మంది వైయెస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ ఏలపై అనర్హత వేటు పడింది. తద్వారా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ముఖ్య మంత్రికి, పిసిసి అధ్యక్షుడికి అగ్ని పరీక్ష పెట్టింది. ఢిల్లీ గల్లీల్లో గొప్పలు చెప్పుకుంటూ.. తిరుగుతున్న ఈ ఇద్దరు నాయకులకు రానున్న ఎన్నికలు లిట్మస్ పరీక్ష లాంటివే. తామేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో జగన్ కు పెరుగుతున్న ప్రజాదరణకు అడ్డు కట్ట వేయడంలో ఈ ఇద్దరు విఫలమైనట్టు కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్ ప్రజా బలంతో తలపడా ల్సిన పరిస్థితి సృష్టించి.. అధిష్టానం ఆటలాడుతోంది. తమకు ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎన్నికల బరిలోకి దిగక తప్పని వాతావరణాన్ని డిల్లీ పెద్దలు సృష్టించారు. నిన్న మొన్నటిదాకా జగన్ ను తిట్టిపోసిన శంకరరావు, డిఎల్ ఇప్పుడు మాటమార్చారు. ఉప ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయమని ఢ౦కా భజాయించి చెబుతున్నారు. మరికాస్త ముందుకెళ్ళి ఉపఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారీ మార్పులు జరుగుతాయని కూడా వెల్లడిస్తున్నారు. టిడిపి మాత్రం ప్రాణ సంకటంలో పడింది. ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూస్తే ఇక పచ్చ జెండాకు పుట్టగతులుండవని ఆ పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. బాబు గారి నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లడం ఖాయమని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు భంగపడిన చంద్రబాబు ముచ్చటగా మూడోసారి కూడా చతికిల పడితే భవిష్యత్తేమిటనే బెంగ ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందరికన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వైఎస్సార్ వంటి దిగ్గజం లేకుండా పార్టీని ఒంటి చేత్తో నడిపించే సత్తా గల నాయకుడి ఆసరా లేకుoడా ... జగన్ వెంట... జనం మధ్యకు ధైర్యంగా వెళ్ళడం నిజంగా కొత్త అనుభూతే!  జగన్ కు అంతో ఇంతో ప్రజాబలం ఉందని అటు కాంగ్రెస్, ఇటు టిడిపి ఒప్పుకుంటూనే ఉన్నాయి. ఒంటరి పోరుకు సిద్ధపడిన జగన్ పార్టీ ఏకలవ్యుడిలా కనిపిస్తోంది. అధికార పక్షాన్ని.. ప్రతిపక్షాన్ని.., సిపిఐ., సిపిఎం వంటి తోక పార్టీలను ఎదుర్కుని వైఎస్సార్ కాంగ్రెస్ అజేయంగా నిలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తప్పవనే విషయం తేటతెల్లం అవుతుంది. ఉప ఎన్నికల తర్వాత కప్పదాట్లు.. గోడ దూకుళ్ళు కచ్చితంగా కనిపిస్తాయి. తాత్సారం చేసినా స్పీకర్ తగిన సమయమలోనే సరైన నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. ఒక దెబ్బకు రెండు పిట్టల్లా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు ఒకేసారి పరీక్ష పెట్టారు స్పీకర్. కడప  లోక్ సభ ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలవడం ఒక ఎత్తైతే... ఆయన తన పార్టీ నాయకుల్ని గెలిపించుకోవడం మరో సవాల్. రాష్ట్ర మంతులు ఎందుకో ఉప ఎన్నికలపి అంతగా ఆసక్తి కనబరుస్తున్నట్టు లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికీ మూడుతుందో... ఎవరి పదవి ఊడుతుందో అర్ధం కాకుండా ఉంది.  టిడిపి శిబిరంలోనూ ఇదే వాతావరణం కనబడుతోంది. ఓటమి భయంతో అసలు పోటికే నేతలు సిద్ధపడడం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్, టిడిపిలు ఏకమై పోరాడక తప్పదని నేతలు చెబుతున్నారు. ఇదే నిజమైతే వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
- శివరాం