పరువు తీస్తున్న పత్రికల రాజకీయాలు....!
జగన్ రాజకీయాలు అటు కాంగ్రెస్ ను ఇటు టిడిపి ని ఇరుకున పెడుతున్నాయి.
సీమంధ్రలో జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. ముఖ్యంగా
గుంటూరు జిల్లాలో సుమారు మూడు నెలలుగా సాగుతున్న యాత్రకు మంచి స్పందనే
కనిపించింది. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేని అధికార పక్షం, ప్రధాన
ప్రతిపక్షం సిబిఐ ని అడ్డుపెట్టుకుని కక్ష సాధిస్తోంది. సిబిఐ ని పావులా
వాడుకుంటోంది. సిబిఐ విచారణ ప్రారంభమైన నాటినుంచి రాష్ట్రంలోని రెండు
ప్రధాన దిన పత్రికలు అనునిత్యం జగన్ అంశాన్నే ప్రధానంశంగా
ప్రచురిస్తున్నాయి. తద్వారా జగన్ కు మరింత ప్రచారం లభిస్తోందే తప్ప నష్టం
జరగడం లేదు. సిబిఐ విచారణ వెనుక టిడిపి కి చెందిన మాజీ మంత్రి ఒకరు
ఉన్నారనే విషయం గతంలోనే వెల్లడైంది. ఆయన కనుసన్నల్లోనే.. సలహాలు.. సూచనల
మేరకే సిబిఐ పనిచేస్తున్నదనే ఆరోపణలు వచ్చాయి. ఒకరకంగా సిబిఐ విచారణ ద్వారా
బయటపడే అంశాల మాట అటుంచితే ప్రస్తుతం పత్రికల మధ్య ప్రచ్చన్న యుద్ధం
నడుస్తున్నట్టు కనబడుతోంది. మూడు దశాబ్దాల ఆధిపత్యాన్ని పోగొట్టుకోలేని
ఈనాడు ఎంతకైనా తెగించడానికి సిద్దపడుతోంది. టిడిపి వర్గాలు నడుపుతున్న
ఆంధ్రజ్యోతి ప్రత్యక్షంగానే ఈనాడుకు సై అంటోంది. ఈ రెండు పత్రికల బరి
తెగింపు వల్ల సాక్షికి ఎనలేని గుర్తింపు వచ్చినమాట నిజం. రాజకీయ రొంపిలో
గొంతులోతు కూరుకుపోయిన పై రెండు పత్రికలు తమ నిస్పాక్షికతను రుజువు
చేసుకోలేకపోతున్నాయి. ఫలితంగా ప్రజల మధ్య తలెత్తుకు నిలబడాల్సిన పత్రికలు
రాజకీయాల మాటున బతుకాల్సిన దుస్థితికి చేరుకున్నాయి. జర్నలిజం విలువల
వలువలూడ్చి నడిబజారులో నిస్సిగ్గుగా నిలబెట్టిన ఘనత ఈ రెండు పత్రికలకే
దక్కుతుంది. ఇప్పుడు సాక్షిని ఏఒక్కరూ భుజనేసుకోవాల్సిన అవసరం లేకుండానే
అస్తిత్వ పోరులో అనవసర ప్రచారాన్ని ఆ రెండు పత్రికలు కల్పిస్తున్నాయి. జగన్
రాజకీయ భవితవ్యాన్ని తేల్చడానికి ఇటీవల జరిపిన రైతు దీక్ష వంటి పోరాటాలు
చాలు. తెలంగాణలొనూ జగన్ కు, ఆయన పార్టీకీ బలమైన పునాదులు ఉన్నాయనడానికి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిపిన పోరాటమే ఉదాహరణ. తెంగాణలో లభించిన
అపూర్వ ఆదరణ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి నూత్నోత్తేజన్నిచ్చింది. అధికార
పక్షం, ప్రతి పక్షం ఉబలాట పడ్డట్టు సిబిఐ విచారణ పేర జగన్ ను వేధించి
చివరకు జైలుకి పంపాలనే ఎత్తుగడ ఫలించినా.. అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
కి మరింత మేలు చేకూరుస్తుందే తప్ప నష్టం జరిగే పరిస్థితులు కనబడడం లేదు.
ఎటొచ్చీ పచ్చ పత్రిక పరువు పోవడం ఒక్కటే ఆఖరి అంకంగా మిగిలిపోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి