4, ఫిబ్రవరి 2012, శనివారం

కిరణ్ కు బాసటగా బాబు...!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు అవగాహనతో ముందుకెళుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు కొందరు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కైందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకం కూడా చంద్రబాబు, కిరణ్ అవగాహనతో ముందుకు వెళుతున్నారనేందుకు మంచి ఉదాహరణ కొందరు ఆరోపిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కోసం నియమించిన ఎనిమిది మంది కమిషనర్లలో విజయ నిర్మల ఒకరు. ఆమెను చంద్రబాబే సూచించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన సూచన మేరకే విజయ నిర్మల నియామకం జరిగిందని అంటున్నారు. ఈమె గత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున నూజివీడు నుండి పోటీ చేసి ఓడిపోయారు. పిఆర్పీ విజయవాడ రూరల్ అధ్యక్షురాలిగా పని చేశారు. ఈమెను చిరంజీవి ప్రతిపాదించక పోయినప్పటికీ కమిషనర్గా నియమించడం పట్ల ఆయన వర్గాన్నే ఆశ్చర్యానికి గురి చేసిందట చంద్రబాబు నాయుడు కేవలం ఐపిఎస్ ఎం.రతన్, ఆంధ్రప్రభ సంపాదకులు విజయ బాబు పేరును మాత్రమే సూచించారని, విజయ నిర్మల పేరును ప్రతిపాదించలేదని కొందరు అంటున్నారు
 సందిగ్ధంలో మంత్రివర్గ విస్తరణ
రాష్ట్ర  మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించాలనే ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి ఆశలపై పార్టీ అధిష్టానం మళ్లీ నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. కేవలం పది నిమిషాల్లో కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ముఖ్యమంత్రి భేటీ ముగిసింది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ప్రస్తావన వచ్చిందా, రాలేదా అనేది కూడా తెలియదు. పది నిమిషాల్లో ఆయన విషయాలు మాట్లాడరనేది కూడా చెప్పలేని స్థితే. సోనియాతో భేటీకి ముందు ఆయన పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్తో సమావేశమయ్యారు. ఆజాద్తో మంత్రి వర్గ విస్తరణపై, పార్టీ వ్యవహారాలపై ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటు విషయంపై, రానున్న ఉప ఎన్నికలపై ఆయన ఆజాద్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆజాద్తో భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఒక్కరే నేరుగా సోనియా నివాసానికి వెళ్లారు. శనివారం ఉదయం ఢిల్లీ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్, సోనియాలతో భేటీకి మధ్యాహ్నం వరకు నిరీక్షించాల్సి వచ్చింది. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంపై జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్పై కోర్టు నిర్ణయం వెలువరించే వరకు ఆయన వేచి చూశారు. కోర్టు నిర్ణయం చిదంబరానికి ఊరట కలిగించడంతో కాంగ్రెసు పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డికి ఆజాద్ను, సోనియాను కలిసే అవకాశం లభించినట్లు చెబుతున్నారు.
 మాయావతి మళ్లీ పీఠం దక్కించుకుంటారా...?
దే ప్రజల దృష్టంతా ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ శానససభ ఎన్నికలపైనే ఉంది. ముఖ్యమంత్రి మాయావతి మళ్లీ పీఠం దక్కించుకుంటారా, కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రచారం పార్టీ పరువును కాపాడుతుందా అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకో0ది. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ ఏం చేయబోతున్నారనేది కూడా ఆసక్తిగానే ఉంది. అయితే, ఉత్తరప్రదేశ్లో మాయావతికి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలున్నట్లుతాజా సర్వేలో తేలింది. ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించనుందని స్టార్న్యూస్-నీల్సన్ సర్వే వెల్లడించింది. గత 2007 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 97 సీట్లు రాగా, ఎన్నికల్లో 26 శాతం ఓట్లు సాధించి మొత్తం 135 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే తెలిపింది.  అలాగే, కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకునే అవకాశాలు ఉన్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకాక తప్పదని ఎన్నికల సర్వే ద్వారా తెలుస్తోంది. స్టార్ న్యూస్-నీల్సన్ సంయుక్తంగా సర్వేను నిర్వహించాయి. గత నెల 4 నుంచి 20 తేదీల మధ్య కాలంలో 202 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించారు. 403 నియోజకవర్గాలున్న యూపీలో మరో నాలుగు రోజుల్లో తొలి దశ పోలింగ్ జరుగనుంది. తాజా సర్వే ప్రకారం - ఎస్పీ 135 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. సీఎం మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 101 సీట్లు గెల్చుకుని ప్రధాన ప్రతిపక్ష హోదాకే పరిమితంకానుంది. గత రెండు దశాబ్దాలుగా మాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీ 79 సీట్లతో మూడో పెద్ద పార్టీగా అవతరించనుంది. ఆర్ఎల్డితో పొత్తు కూడా కాంగ్రెసు పార్టీకి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఆర్ఎల్డి 20 సీట్లు గెలుచుకుంటుందని అంచనా.  గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి కష్టంగా 22 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్కు పూర్వవైభవం తేవడానికి రాహుల్ గాంధీ పడిన శ్రమ కొంతమేరకు ఫలించే అవకాశాలున్నట్లు సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. గత ఎన్నికల్లో 51 సీట్లతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈసారి 61 సీట్లను కైవసం చేసుకోనుంది. అలాగే, ఆర్ఎల్డి పార్టీ తన సీట్ల సంఖ్యను 10 నుంచి 20కు పెంచుకోనుంది. ఇతర పార్టీలు పెంచుకునే సీట్లన్నీ మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ నుంచే జారిపోయే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో మాయావతి బఎస్పీ 207 సీట్లతో భారీ మెజారిటీ సాధించింది.
రాహుల్ చెబితే.. రాజకీయాల్లోకి... ప్రియాంక!
 సోనియా గాంధీ తనయ ప్రియాంక ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారు. ఉత్తర ప్రదేశ్లో రెండో రోజు పర్యటిస్తున్న ఆమె తాను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే విషయమైనా తన సోదరుడు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసే విషయమై రాహుల్తో చర్చించిన అనంతరం నిర్ణయిస్తామన్నారు. రాహుల్ ఓకే అంటే తాను సిద్ధమన్నారు. త్వరలో యుపిలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో రాహుల్, సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న అమెథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ సోమవారం నుండి ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్ర కాంగ్రెసు నేతలు ప్రియాంక  పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని కోరుతున్నారు. అలా అయితే కాంగ్రెసుకు భారీస్థాయిలో లబ్ధి చేకూరుతుందని వారు అంటున్నారు. ఆమె వ్యాఖ్యలు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నట్లుగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి