10, ఫిబ్రవరి 2012, శుక్రవారం



తెలంగాణ ఉద్యోగుల సమ్మె నోటీస్
తెలంగాణ ఎన్జిఓ నేతలు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపంకజ్ ద్వివేదిని కలిసి సమ్మె నోటీస్ ఇచ్చారు. సకల జనుల సమ్మె సందర్భంగా  ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామని వారికి ద్వివేది హామీ ఇచ్చారు. అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద టిఎన్జిఓ అధ్యక్షుడు స్వామిగౌడ్ విలేకరులతో మాట్లాడారు. సకల జనుల సమ్మె కాలంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అనివార్య పరిస్థితులలో సమ్మె నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. సమ్మె చేసినందుకు తన పదోన్నతిని కూడా నిలిపివేసినట్లు ఆయన చెప్పారు. తమకు ఇచ్చిన హామీలను తక్షణం పరిష్కరించకపోతే దశలవారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నెల 21 నుంచి భోజన విరామ సమయంలో ఆందోళన చేస్తామన్నారు. మార్చి 5 నుంచి వర్క్ టు రూల్ పాటిస్తామని చెప్పారు. మార్చి 20 చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ సమ్మె చేస్తామని హెచ్చరించారు
--------------------------------------------
ఉచ్చులోకి లాగొద్దు- మోపిదేవి
 
 మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కామెంట్స్కు ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ కౌంటరిచ్చారు. తనకు మద్దతుగా మాట్లాడిన డీఎల్ కు కృతజ్ఞతలు చెబుతూనే మద్యం సిండికేట్ వ్యవహారంలో తననెవరూ బలిపశువును చేయలేదన్నారు. తనపై కుట్ర జరిగిందని భావించడం లేదని ఆయన అన్నారు. ఏసీబీ రిపోర్ట్కు రాజకీయాలు జోడించవద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చేసే విమర్శలోకి తనను లాగవద్దని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బీసీలను అణగదొక్కుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న వెంకటరమణ, ఏసీబీ రిపోర్ట్ పై త్వరలోనే క్లారిటి వస్తుందన్నారు. నాపై విచారణకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని, దీన్ని రాజకీయం చేయొద్దని ఆయన అన్నారు
సిఎం కిరణ్ ఇరుకున పడ్డారు: రోజా
పిసిసి  అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లక్ష్యంగా ఎసిబి దాడులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేయించగా, పలువురు మంత్రులు, శాసనసభ్యులకూ ప్రమేయం ఉండటంతో తిరిగి అది కిరణ్కే భస్మాసుర హస్తమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా గురువారం విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యం సిండికేట్లతో 20 మంది మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. మద్యం అదనపు ఉత్పిత్తికి ఏడాది కాలంలో 17 ఉత్తర్వులు వెలువరించడం సిగ్గు చేటని సిఎంపై ధ్వజమెత్తారు. సిఎల్పి అంటే కాంగ్రెస్ లిక్కర్ పార్టీగా మారిందన్నారు. మద్యాంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్కు అధ్యక్షుడని బొత్సను విమర్శించారు. నిషేధాన్ని ఎత్తి వేసి, బెల్టు షాపులకు కారణమైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మాట్లాడే హక్కు లేదని అన్నారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గ ఎమ్మెల్యేలపై వేటు వేస్తే భయపడేది లేదని రోజా అన్నారు. భూపందేరంపై శాసనసభా సంఘం ఏర్పాటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే, కమిటీ విచారణ పరిధిని కేవలం వైఎస్ హయానికే పరిమితం చేయకుండా 1995 నుంచి 2012 వరకు జరిగిన భూ కేటాయింపుల నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, పార్టీ నేత నల్లా సూర్యప్రకాష్రావు డిమాండ్ చేశారు.
 బోత్సానా... మజాకా...?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుర్చీ కిందికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నీళ్లు తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థులను బొత్స సత్యనారాయణ చేరదీసి మరో పవర్ సెంటర్గా ఆయన మారుతున్నట్లు చెబుతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా అసమ్మతివాదులతో మాట్లాడి, వారిని సాధకబాధకాలు తెలుసుకోవడం తన బాధ్యతగా చెబుతూ కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన లాబీనీ ఆయన తయారు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిపై అసంతృప్తితో ఉన్న మంత్రులు, పార్టీ నాయకులు కూడా బొత్స సత్యనారాయణను కలుస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఎదుర్కునే దమ్మున్న నేతగా వారు బొత్స సత్యనారాయణను గుర్తిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే, కిరణ్ కుమార్ రెడ్డి అంటే గిట్టనివారంతా బొత్స పక్కన చేరుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బొత్సతో సమావేశమై తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవికి దగ్గరవుతున్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యవహారం నడుస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవి నివాసానికి వెళ్లి మంతనాలు జరిపారుఏమైనా, కాంగ్రెసులో రెండు పవర్ సెంటర్లు ఉండడం కొత్తేమీ కాదు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పిసిసి అధ్యక్ష పదవి మొక్కుబడిగా మారింది. మిగతా అన్ని కాలాల్లోనూ పిసిసి అధ్యక్షుడికి, ముఖ్యమంత్రికి పడకపోవడం కాంగ్రెసు రాజకీయాల్లో మామూలు వ్యవహారమే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి