3, ఫిబ్రవరి 2012, శుక్రవారం




సిబిఐ దర్యాప్తు తీరుపై ఐఎఎస్ అధికారుల సమరభేరీ
సిబిఐ దర్యాప్తు తీరుపై సమరభేరీ మోగించేందుకు రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్, ఎమ్మార్ కుంభకోణం, వైయస్ జగన్ ఆస్తుల కేసుల దర్యాప్తు విషయంలో సిబిఐ ఐఎఎస్ అధికారులను వేధిస్తోందని, ఐఎఎస్ అధికారులను బలి పశువులను చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. దాదాపు 60 మంది ఐఎఎస్ అధికారులు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి సిబిఐ దర్యాప్తు తీరుపై ఫిర్యాదు చేశారు. మేరకు వారు వినితపత్రం కూడా సమర్పించారు. తిరిగి ఆదివారం సమావేశమై ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ఆలోచనలో కూడా వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క రోజు పెన్ డౌన్ సమ్మెకు వారు సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కలిసి సిబిఐ దర్యాప్తు తీరుపై ఫిర్యాదు చేయాలనే యోచనలో కూడా వారున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసి తర్వాత ఐఎఎస్ అధికారుల తరఫున మహాపాత్రో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి తమకు చెప్పినట్లు ఆయన తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటానని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి తెలియకుండా ఐఎఎస్ అధికారులు నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తీసుకోవచ్చునని, అయితే ఇతరులు తీసుకునే నిర్ణయాలకు తాము ఎలా బాధ్యులం అవుతామని ఆయన అన్నారు. ఇతరులు తీసుకున్న నిర్ణయాలకు ఐఎఎస్ అధికారులను బలపశువులను చేస్తున్నారని ఆయన అన్నారు. ఇతరులు ఎవరనే విషయం చెప్పడానికి ఆయన నిరాకరించారు. వేరేవాళ్లను వదిలేసి సిబిఐ ఐఎఎస్ అధికారులను వేధిస్తోందని ఆయన విమర్శించారు. తాము మంత్రి వర్గం తీసుకునే నిర్ణయాలను మాత్రమే అమలు చేస్తామని, ముందూ వెనకా చూడకుండా సిబిఐ తమను వేధిస్తోందని ఆయన అన్నారు. ఇతరులు తీసుకునే నిర్ణయాలకు బ్యూరోక్రాట్లను బాధ్యులను చేయడం సరి కాదని ఆయన అన్నారు. సిబిఐ దర్యాప్తులో ప్రోద్బలాలు పనిచేస్తున్నాయని భావిస్తున్నారా అని అడిగితే తాను ఎలా చెప్పగలనని, ప్రభుత్వ సేవకుడిగా తాను ఇంతకు మించి చెప్పలేనని ఆయన సమాధానమిచ్చారు. ప్రభుత్వంలో సమర్థత, పారదర్శకత ఉండాలని ఆయన అన్నారు. స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం తమకు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. ఐఎఎస్ పరిధిని, అధికారాలను సిబిఐ తెలుసుకోవాలని రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారులు అంటున్నారు. ఐఎఎస్ అధికారులు అజయ్ మిశ్రా, రమాకాంత్ రెడ్డి వంటివారిని సిబిఐ ప్రశ్నించడం, ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మి వంటి ఐఎఎస్ అధికారులను అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఐఎఎస్ అధికారులు తీవ్రమైన కలవరానికి గురైనట్లు కనిపిస్తున్నారు.
 
వైయస్ జగన్ గురించి సిబిఐ అడగలేదు: రమాకాంత్ రెడ్డి
సిబిఐ అధికారులు తనను కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఏమీ అడగలేదని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి చెప్పారు. రెండో రోజు శుక్రవారం ఆయన సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. రమాకాంత్ రెడ్డిని సిబిఐ అధికారులు శుక్రవారం నాలుగు గంటల పాటు విచారించారు. నిన్న అడిగిన ప్రశ్నలే రోజు అడిగారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కేటాయించిన భూములపై, చేపట్టిన పథకాలపై సిబిఐ అధికారులు ప్రశ్నలు వేశారని, వాటికి తాను సమాధానం ఇచ్చానని ఆయన చెప్పారు. జీవోల జారీలో నిబంధనలు పాటించారా, లేదా అని అడిగినట్లు ఆయన తెలిపారు. మంత్రి వర్గంలో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు జరిగాయా, లేదా అని అడిగారని, మంత్రి వర్గ నిర్ణయాల ప్రకారమే జీవోలు విడుదల చేశారా, జీవోల జారీలో ఎవరి ఒత్తిడైనా పనిచేసిందా అని అడిగారని, మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతనే జీవోలు జారీ అయ్యాయని తాను చెప్పానని ఆయన వివరించారు. భూముల కేటాయింపుల్లో విధమైన అక్రమాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ విచారణకు రావాలని సిబిఐ అధికారులు తనను అడగలేదని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి సంతకాలతోనే పలు జీవోలు జారీ అయ్యాయి. దీంతో సిబిఐ ఆయనను విచారించింది.


చిన జీయర్ స్వామి తిరుమల పాదయాత్రకు బ్రేక్
Chinna Jeeyar Swami
తిరుమల: చిన జీయర్ స్వామి తిరుమల పాదయాత్రకు బ్రేక్ వేసి కారులో తిరుమల చేరుకున్నారు. అలిపిరి నుంచి తిరుమల వరకు ఆయన శుక్రవారం సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. ఏడో మైలు రాయి వద్ద ఆయన అకస్మాత్తుగా పాదయాత్రను ఆపేసి కారులో తిరుమల చేరుకున్నారు. దీనిపై ప్రతిస్పందిస్తూ చిన జీయర్ స్వామి - మీడియా ప్రతినిధులు గమనిస్తున్నారో, లేదో తెలుసుకుందామని కారులో వచ్చానని అన్నారు. తిరుపతిలో ఉదయం ఆయన విష్ణుసహస్ర నామ స్త్రోత్ర పారాయణ మహాయజ్ఞం నిర్వహించారు. చినజీయర్ జీయర్ పేరుతో భక్తి వెబ్ ఛానల్ ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. అయితే, స్వామివారి దర్శనం దక్కదేమోననే ఉద్దేశంతో ఆయన కారులో వచ్చినట్లు చెబుతున్నారు. మాడవీధుల్లో స్వామివారి ప్రదక్షిణ సందర్భంగా దర్శనం చేసుకోవాలని ఆయన అనుకున్నారు. కానీ ఆయన అక్కడికి చేరుకునే సరికే ప్రదక్షిణ పూర్తయింది.

చిన జీయర్ స్వామి వరాహ స్వామిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారికి మాత్రమే సహస్ర దీపాలంకరణ చేయాలని చినజీయర్ స్వామి అంటున్నారు. తిరుపతిలో ఆయన అంతకు ముందు మాట్లాడారు. తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారని ఆయన అన్నారు. టిటిడి వ్యవస్థ సక్రమమార్గంలో నడిచేలా చూడాలన్నారు. తిరుమల గురించి తెలిసిన వారే టిటిడి సభ్యులుగా ఉండాలని, ఆలయ పాలనలో లాజిక్కులు ప్రమాదకరమని హెచ్చరించారు. చరిత్ర తెలియని వారు చరిత్ర గురించి మాట్లాడటం బుద్ధి లేని పని అన్నారు. లోపాలను ఎత్తి చూపడం మా లక్ష్యం కాదన్నారు. వెయ్యికాళ్ల మండపం కూల్చి వేసిన అధికారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

మరాఠీ సాంప్రదాయంలో ఘనంగా జెనీలియా వివాహం
genelia wedding
బాలీవుడ్ స్టార్స్ జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ వివాహం శుక్రవారం ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఘనంగా జరిగింది. మరాఠీ సంప్రదాయం ప్రకారం వివాహ మహోత్సవం నిర్వహించారు. వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు కేంద్ర స్థాయిలోని రాజకీయ నాయకులు హాజరయ్యారు. హాజరైన వారిలో శరద్ పవార్, పృథ్విరాజ్ చౌహాన్, ప్రపుల్ పటేల్, అభిషేక్ బచ్చన్, కాజోల్ మరియు అజయ్ దేవగన్ తదితరులు ఉన్నారు. రితేష్ దేశ్ ముఖ్ తండ్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ ప్రస్తుత కేంద్ర మంత్రి. గతంలో ఆయన మహా రాష్ట్ర ముఖ్య మంత్రిగా కూడా పని చేశారు.

జెనీలియా-రితేష్ తొలిసారిగా 2003లో తాము కలిసి నటించినతుజె మేరీ కసమ్చిత్రంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. గత ఆరేళ్లుగా వీళ్లు ప్రేమాయణం సాగిస్తున్నా మీడియాకు చిక్కకుండా వ్యవహరించారు. అయితే కొన్ని రోజుల క్రితం ప్రముఖ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ రితేష్ విషయాన్ని బయట పెట్టారు.


రాజ్యసభ సీటు కోసం టిడిపిలో పరుగులు
Mysoora Reddy
తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సీట్ల కోసం పోటీ తీవ్రమైంది. తమకు దక్కే రెండు సీట్ల కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. ఏడాది ఏప్రిల్లో రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మార్చి నెలాఖరులో జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో టీడీపీ సంఖ్యాబలం ప్రకారం పార్టీకి రెండు సీట్లు దక్కే అవకాశం ఉంది. ఇందులో సీమాంధ్రకు ఒకటి, తెలంగాణకు మరొకటి దక్కవచ్చునని అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంవి మైసూరారెడ్డి ఈసారి రిటైరవుతున్నారు. ఆయనకు మళ్ళీ అవకాశం ఇస్తారా లేక ప్రాంతం నుంచి మరొకరికి అవకాశం దక్కుతుందా అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కుల సమీకరణలను లెక్కలోకి తీసుకుంటే మైసూరాకు అవకాశం ఇవ్వక తప్పదని అంటున్నారు.

ఉప ఎన్నికల్లో కడప లోక్సభ స్థానానికి తమ అభ్యర్థిగా మైసూరా రెడ్డిని తెలుగుదేశం పార్టీ పోటీకి దించింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థి అని ముందుగానే చెప్పారు. కారణం వల్ల ఈసారి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ చేయకపోవచ్చుననే వాదన కూడా వినిపిస్తోంది. మైసురా మాత్రం రాజ్యసభ సభ్యత్వానికే మొగ్గు చూపుతున్నారు. ఆయనకు అవకాశం రాని పక్షంలో రాజ్యసభ సభ సభ్యత్వాన్ని కోరుతున్న వారి సంఖ్య సీమాంద్రుల సంఖ్య గణనీయంగానే ఉంది. మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు జాబితాలో ముందు వరసలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడం ద్వారా ఆయన అందరికంటే అడుగు ముందున్నారు. కడప జిల్లాకే చెందిన పార్టీ ఉపాధ్యక్షుడు, పారిశ్రామికవేత్త సీఎం రమేష్ కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.

మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు కూడా రాజ్యసభపై కోరికతో ఉన్నా రెండేళ్ళలో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఆయనకు అవకాశం రాకపోవచ్చని అంటున్నారు. అదే ప్రాంతం నుంచి సీటును ఆశిస్తున్నవారిలో పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి టిడి జనార్దనరావు, కంభంపాటి రామ్మోహనరావు, వర్ల రామయ్య, కృష్ణబాబు, లాల్జాన్బాషా తదితరులు ఉన్నారు.

తెలంగాణ ప్రాంతం నుంచి దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్ ఇప్పుడు తమ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టి పనిచేసుకొంటున్నారు. వారి పేర్లు పరిగణనలోకి వస్తాయా లేదా అన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎనిమిదేళ్లుగా అధ్యక్షుడికి పార్టీ వ్యవహారాల్లో అండగా ఉంటూ వచ్చిన వరంగల్ జిల్లా నేత గరికపాటి మోహనరావు ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు, సంకినేని వెంకటేశ్వరరావు, వేం నరేంద్ర రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు కూడా తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి