11, ఫిబ్రవరి 2012, శనివారం

మరణించిన వైయస్పై విచారణా...? 
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మరోసారి లేఖాస్త్రం సంధించారు. ఈసారి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్పై ఆమె లేఖాస్త్రం సంధించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయడం పట్ల ఆమె అభ్యంతరం తెలిపారు. మరణించిన వ్యక్తిపై విచారణలా అని ఆమె ప్రశ్నించారు. 1994 నుంచి జరిగిన భూకేటాయింపులపై విచారణ జరిపించాలని, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని ఆమె అన్నారు. నిర్ణయం తీసుకున్న 11 నెలల తర్వాత సభా సంఘం వేయడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభా సంఘం విధివిధానాల్లో కూడా స్పష్టం లేదని ఆమె అన్నారు. తెలుగుదేశం  ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని కొంత మంది శాసనసభ్యులు డిమాండ్ చేస్తున్నారని, అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందుకు సిద్ధంగా లేరని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని కాగ్, లోకాయుక్త కూడా తప్పు పట్లలేదని ఆమె గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే వైయస్ ప్రభుత్వ హయాంలోని భూకేటాయింపులపై మాత్రమే సభా సంఘం వేశారని విజయమ్మ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణపట్నం, గంగవరం ఓడరేవులు, రహేజా, ఓడ చెరువు, ఎమ్మార్, శంషాబాద్ విమానాశ్రయం, ఆరు పవర్ ప్రాజెక్టులు, కాకినాడ సీపోర్టు, విశాఖ ప్రాజెక్టు, ఎంఐజి భారత్ వంటి పలు ప్రాజెక్టులకు భూకేటాయింపులు జరిగాయని ఆమె శనివారం నాదెండ్ల మనోహర్కు రాసిన లేఖలో తెలిపారు. వివిధ కేసుల్లో సిబిఐ ఐఎఎస్ అధికారులను మాత్రమే విచారించడం సరి కాదని, మిగతావారిని కూడా విచారించాలని ఆమె అన్నారు.

అనర్హత వేటుకు జాప్యం ఎందుకు...?
కాంగ్రెసు పార్టీ నాయకుల వ్యూహంలో భాగంగా జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై అనర్హత వేటు విషయంలో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  వారిపై అనర్హత వేటు వేయడానికి శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సిద్ధపడినా కాంగ్రెసు పార్టీలోని అంతర్గత రాజకీయ పరిణామాల వల్ల చర్య  వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలకు ముందే వైయస్ జగన్ వర్గానికి చెందిన 16 మంది శాసనసభ్యులపై వేటు పడుతుందని, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తారని భావించారు. కానీ అది మార్చి మొదటివారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతనే వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటు వేయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు భావిస్తోంది. . ఏడు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే వారిపై అనర్హత వేటు వేస్తే రాష్ట్రంలో 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరుగుతాయి. ఒకేసారి 24 స్థానాలకు ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెసు పార్టీ భయపడుతున్నట్లు చెబుతున్నారు. దాదాపు మినీ సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వ్యతిరేక ఫలితాలు వస్తే తట్టుకోవడం కష్టమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోగా  తమను శాసనసభలో ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు స్పీకర్ను కోరడానికి సిద్ధపడుతున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి